Sunday, April 20, 2025

LATEST UPDATES
>> కోళ్ళలో వైరస్ ల ప్రభావంతో వచ్చే వ్యాధులు! తీసుకోవాల్సిన జాగ్రత్తలు  >> కోళ్లలో వచ్చే పుల్లోరం వ్యాధి లక్షణాలు మరియు యాజమాన్యం  >> అల్లం సాగు విధానం, రకాలు, యాజమాన్య పద్ధతులు, ఎరువులు, మరియు సస్యరక్షణ  >> రబీలో 'కుసుమ' సాగు  >> రాగుల సాగులో మెళకువలు    

Saturday, October 1, 2022

సులభంగా సుబాబుల్ సాగు

     సుబాబుల్ మొక్క శాస్త్రీయ నామం ల్యూకేనా ల్యూకోసెఫాలా (Leucaena leucocephala). పశుగ్రాసంగా పాడి వ్యర్ధభూముల్లో (బంజరు భూముల్లో) సుబాబుల్‌ను  విస్తృతంగా సాగుచేస్తారు. సుబాబుల్‌ ఆకులను పశువులకు పచ్చిమేతగా ఉపయోగించడమే కాకుండా పేపర్ తయారీకి కూడా ఉపయోగిస్తుండటంతో వీటికి డిమాండ్ అధికంగా ఉంది. ఈ మొక్కలను సాగు చేయాలనుకునే రైతులు వానాకాలంలో సాగు చేస్తే మొక్కలు త్వరగా పెరుగుతాయి. మొక్క త్వరగా ఎదగటానికి మనం చిగురును తుంచే కొద్దీ చెట్టు కాండం సైజు పెరుగుతూ తిరిగి కొమ్మలు ఎక్కువ వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాతావరణ పరిస్థితులు ఈ సాగు కి అనుకూలిస్తాయి. కాబట్టి ఈ మొక్కలను సులువుగా సాగు చేయవచ్చు. 


నేలలు:

     ఈ మొక్క అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. లోతైన, సారవంతమైన, ఎక్కువ తేమ లభ్యమయ్యే నేలలు వీటికి మరింత అనుకూలంగా ఉంటాయి. అటవీ వ్యవసాయ పద్ధతిలో పంట పొలాల్లో కూడా వీటిని పెంచవచ్చు. 

నారు మొక్కల పెంపకం:

      బాగా ఎదిగిన మొక్కల నుంచి విత్తనాలు సేకరించాలి. ఒక కిలోకు 16,000 నుంచి 20,000 విత్తనాలు ఉంటాయి. సీడ్ క్లీనింగ్ కోసం, ఈ విత్తనాలను 30 డిగ్రీల సెల్సియస్ వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచాలి మరియు వేడి నీటి నుండి తీసిన విత్తనాన్ని 12 గంటలు చల్లని నీటిలో నానబెట్టి విత్తుకోవాలి. విత్తన శుద్ధి తర్వాత నారుమళ్ళలో (లేదా) పాలిథీన్ సంచుల్లో నాటుకోవచ్చు. ఈ విత్తనాలను మార్చి ఏప్రిల్ నెలల్లో విత్తినట్లయితే వర్షాకాలంకల్లా మొక్కలు నాటటానికి తయారవుతాయి.

నాటే పద్ధతి:

         ఈ మొక్కలను సాగు చేసే రైతులు మొక్కల మధ్య దూరం ఎక్కువగా పాటించాలి. ఇవి ఎత్తుగా పెరుగుతాయి కాబట్టి వరుసల మధ్య కనీసం 2 నుంచి 4 మీటర్ల దూరం పాటించాలి. ఎకరాకు 700 నుండి 1000 మొక్కల వరకు నాటుకోవచ్చు. మొక్కలు నాటిన మొదటి రెండేళ్ల వరకూ అంతర పంటలు వేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి చెట్ల ఎదుగుదల ఆధారంగా 2 నుంచి 5 ఏళ్లలో చెట్లను నరక వచ్చు. సుబాబుల్ ఆరేళ్లలో 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వర్షాధార ప్రాంతాల్లో సాధారణంగా కలప దిగుబడి ఎక్కువగా వస్తుంది. పశుగ్రాసం ఎకరాకు వర్షాధార ప్రాంతాల్లో 5 నుంచి 10 టన్నులు, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 32 నుంచి 36 టన్నుల దిగుబడి వస్తుంది. కాగితం తయారీకి కావలసిన శ్రేష్టమైన గుజ్జు నుంచి లభిస్తుంది. ఈ కలపను, ఆకులను, వంటచెరకుగా, నారగా మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు. మొక్క తక్కువ కాలంలోనే పెరుగుతుంది కాబట్టి ఈ సాగు చేసిన రైతులు సులభంగా లాభాలు పొందవచ్చు.

పచ్చిరొట్ట:

        ఖరీదైన నత్రజని ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు సుబాబుల్‌ను పచ్చని పచ్చిరొట్టగా ఉపయోగించవచ్చు. పచ్చిరొట్టగా వాడితే ఎకరానికి 8 నుంచి 12 కిలోల నత్రజని లభిస్తుంది. అంతర పంటల ద్వారా నత్రజని అవసరాన్ని 50 శాతం తగ్గించుకోవచ్చు.

సమస్యలు - పరిష్కారం:

            పశుగ్రాసం లా పనికి వస్తుంది కనుక మొదటి సంవత్సరం మొక్కలను పశువులు, మేకల బారి నుండి కాపాడుకోవాలి. "మిమోసిన్" అనేది లేత ఆకుల్లో ఎక్కువగా ఉన్నందున సుబాబుల్ రెమ్మలను ఇతర మేతతో మేపాలి.  ఈ చెట్లకు సహజ పునరుత్పత్తి అధిక రేట్లు ఉండటం వలన చివరకు కలుపు మొక్కలుగా మిగలవచ్చు. దీదీనిని నివారించడానికి, తరచుగా అంతరకృషి చేయాలి.

No comments:

Post a Comment

@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Seo Blogger Templates