దేశంలో వరి, గోధుమ, మొక్కజొన్న తర్వాత చిరుధాన్యాల పంటల్లో విస్తృతంగా పండిస్తున్న పంట "రాగి". రాగుల యొక్క శాస్త్రీయ నామం "ఇల్యుసైన్ కొరకానా" దీని సాగులో చీడలు తక్కువే. పెట్టుబడి తక్కువ... లాభం ఎక్కువ పొందగలిగే పంటల్లో రాగి ప్రధానమైనది. రాగులలో ఎక్కువ పోషక విలువలు (ఐరన్, కాల్షియం, పీచుపదార్థం, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు) ఉండటంతో మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇసుక, చౌడు భూముల్లో ఈ పంటను సులభంగా సాగుచేయవచ్చు. ఇది కర్ణాటకలో ఒక ముఖ్యమైనటువంటి తృణధాన్యపుపంట.
రాగుల సాగుకు అనుకూలమైన సమయం:
వీటి సాగుకు రైతులు ఖరీఫ్ లో జూలై నుంచి ఆగష్టు వరకూ, రబీలో అక్టోబర్ నుండి నవంబర్ వరకు, వేసవిలో ఫిబ్రవరి మొదటి వారంలో నాట్లు వేసుకోవాలి. ఈ పంట రసాయన ఎరువులతో పోల్చుకుంటే సేంద్రీయ ఎరువులతో సాగు చేస్తే .... ఎక్కువ దిగుబడి వస్తుంది. పొలం దున్నడానికి ముందే పొలంలో పశువుల ఎరువు చల్లుకొని కలియదున్నాలి.రాగి 100 నుంచి 110 రోజులలో పంట కోతకు వస్తుంది. రైతులు సరైన యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం దేశంలో రాగులకు కనీస మద్దతు ధర నాలుగు వేలకు పైనే ఉంది.
మెళకువలు:
రాగులను వెదజల్లే పద్ధతి లేదా మడులు ఏర్పాటు చేసుకొని విత్తుకోవాలి. ఎకరాకు 2 కిలోల విత్తనాలు సరిపోతాయి. రాగి లో అధిక దిగుబడినిచ్చే రకాల పట్ల రైతులు ప్రత్యేక దృష్టి సారించాలి.
రాగుల సాగులో విత్తనశుద్ధి:
ప్రతి కిలో విత్తనానికి ఒక లీటరు నీటి చొప్పున విత్తనాన్ని 6 గంటలపాటు నీటిలో నాన బెట్టాలి. విత్తనాలను నీటినుండి వడగట్టి తడిగుడ్డలో రెండు రోజులపాటు గట్టిగా కట్టాలి. రెండు రోజుల తర్వాత తడిగుడ్డ నుండి విత్తనాలను తీసివేయాలి. అవి మొలకెత్తే సంకేతాన్ని చూపిస్తాయి. వాటిని రెండు రోజులపాటు నీడలో ఆర బెట్టాలి.
రాగి లో మారుతీ రకం మేలైనదిగా చెప్పవచ్చు. ఈ రకం 80 నుంచి 90 రోజుల్లోనే పంట వస్తుంది. ఇది 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. వేగావతి సువర్ణముఖీ రకాలు అన్ని రకాల నేలల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. వీటితో 14 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు. వకుళ, భారతి, శ్రీ చైతన్య, హిమ అధిక దిగుబడినిస్తూ అగ్గితెగులు తట్టుకుంటూ అన్ని ప్రాంతాల్లో సాగు చేసేలా ఉంటాయి. మొక్కల సాలు మధ్యదూరం 30 సెంటి మీటర్లు , మొక్కల మధ్య దూరం 15 సెంటి మీటర్లు పాటించాలి.
చేనులో ఎక్కువగా తెగులు ఏర్పడితే గింజలు తాలుగా మారుతాయి. కాబట్టి రైతులు జాగ్రత్తలు తీసుకుంటూ పొలాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. వెర్రి కంకి తెగులు చెను వేసిన ౩౦ రోజుల దశనుంచే వచ్చే అవకాశం ఉంది. ఇది వ్యాపిస్తే గింజలు ఆకులుగా మారుతాయి. దీంతో గింజలు సరిగా ఏర్పడవు. చేను పై గింజలు ముదురు రంగులోకి మారిన తర్వాతనే పంట కోతలు చేపట్టాలి. ఆ తర్వాత కంకులను ఒక చోటికి చేర్చి ట్రాక్టర్తో తొక్కించడం లేదా కర్రలతో కొట్టాలి. దీంతో కుప్ప నూర్చడం సులభం అవుతుంది.
ఒకవేళ ఇది మీకు నచ్చితే : రాగి జావ తాగటం వల్ల ప్రయోజనాలు
No comments:
Post a Comment