Friday, April 18, 2025

LATEST UPDATES
>> కోళ్ళలో వైరస్ ల ప్రభావంతో వచ్చే వ్యాధులు! తీసుకోవాల్సిన జాగ్రత్తలు  >> కోళ్లలో వచ్చే పుల్లోరం వ్యాధి లక్షణాలు మరియు యాజమాన్యం  >> అల్లం సాగు విధానం, రకాలు, యాజమాన్య పద్ధతులు, ఎరువులు, మరియు సస్యరక్షణ  >> రబీలో 'కుసుమ' సాగు  >> రాగుల సాగులో మెళకువలు    

Thursday, October 6, 2022

రబీలో 'కుసుమ' సాగు

          ఔషధ మొక్కగా నూనెగింజల పంట విశిష్ట ప్రాధాన్యత కలిగిన పంట కుసుమ. కుసుమ యొక్క శాస్త్రీయ నామం "కార్థామస్ టింక్టోరియస్".  చల్లని వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే ఈ పంట తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేయబడుతోంది. ఈ పంటకు నల్లరేగడి భూములు అనువైనవి. గతంలో ఈ పంటకు ఆదాయం తక్కువగా ఉండటం, మొక్కలకు ముళ్ళు ఎక్కువగా ఉండటం, కూలీలు దొరకకపోవడం వల్ల రైతులు ఈ పంట వేయటానికి వెనకడుగు వేశారు. ఇప్పుడిప్పుడే ఈ పంటకు దిగుబడి, ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయం వస్తుండడంతో రైతులు ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ముళ్ళు లేని రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రత్యామ్నాయ పంటలు పండించాలి అనుకునే రైతులకు ఇది ఒక మంచి ఎంపిక. శీతాకాల పంట అయినటువంటి కుసుమ ఉత్తమ సాగు విధానం తెలుసుకుందాం.,

విత్తే సమయం:

          ఈ సాగు చేయాలి అనుకునే రైతులు సెప్టెంబర్ నుంచి నవంబర్ మొదటి వారం వరకు విత్తనాలను విత్తుకోవాలి. పంట కాలంలో వాతావరణంలో తేమ తక్కువగా ఉండటం, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం పంట ఎదుగుదలకు దోహదం చేస్తాయి.

విత్తనశుద్ధి:

          విత్తన శుద్ధి చేశాక విత్తుకుంటే చీడల బెడద తక్కువగా ఉంటుంది. విత్తనం ద్వారా సంక్రమించే అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు భూమిలోని శీలింధ్రాల ద్వారా సంక్రమించే ఎండు తెగులును నియంత్రించడానికి విత్తనశుద్ధి అత్యంత అవశ్యకం. 2 గ్రా. కాప్టాన్ లేదా 1 గ్రా. కార్బండాజిమ్, 4 కిలో విత్తనానికి కలిపి విత్తుకోవాలి.


కుసుమ రకాలు:

రకం

పంటకాలం (రోజుల్లో)

దిగుబడి (క్వి/)

గుణగణాలు

టి.ఎస్.ఎఫ్.-1

125-130

6.0-7.0

తెల్ల పూల రకము. అధిక దిగుబడినిచ్చి ఎండు తెగులును పూర్తిగా మరియు పేనుబంకను కొంత వరకు తట్టుకుంటుందిఇందులో నూనె శాతం ౩౦% ఉండటంతో పాటు ఎండు తెగులును తట్టుకొంటుంది.

మంజీర

115-120

4.0-5.0

పూలు మొదట పసుపుగా ఉండి తరువాత నారంజి రంగుకు మారుతాయి. గింజ తెల్లగా ఉండి 27-30% నూనెను కలిగి వుంటుంది

నారి-6

130-135

5.0-6.0

ఇది ముళ్ళులేని రకం కావడం వల్ల పంటకోత మరియు నూర్పిడి సులభతరమౌతుంది. పూతను సేకరించుకోవడానికి అనుకూలమైన రకం.

పి.బి.ఎన్.ఎస్.12

130

7.0

నీటి పారుదల క్రింద సాగుకు అనువైన రకం

జె.యస్.ఎఫ్.414 (పూలే కుసుమ)

135

8.0

నీటి పారుదల క్రింద సాగుకు అనువైన రకం

డి.యస్.హెచ్.-185

130

7.0-8.0

ఎండు తెగులును తట్టుకునే సంకర రకం. నీటి పారుదల క్రింద సాగుకు అనువైన రకం


          రైతులకు ఇబ్బంది లేకుండా వరి కోత మిషన్ ద్వారా ఈ పంటను సులభంగా కోయవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కుసుమను ముఖ్యంగా వంట నూనె రంగుల కోసం సాగు చేస్తారు. సాగుచేసే విత్తన రకాల ఆధారంగా పంటకాలం 120 నుంచి 130 రోజులు ఉంటుంది. ఎకరాకు ఈ పంట లో ఆరు నుంచి పది క్వింటాళ్ల దిగుబడి వస్తుందని సాగుచేస్తున్న రైతులు చెబుతున్నారు.  ఎకరాకు నాలుగు కిలోల విత్తనాలు అవసరమవుతాయి. 


పంటల ప్రణాళిక:

కుసుమను పండించే రైతులు ప్రత్తి లేదా కంది వంటి పంటలతో మార్పిడి చేయడం వల్ల కుసుమను ఆశించే ఎండు తెగులును రాకుండా నివారించుకోవచ్చు.  1:2 నిష్పత్తిలో  కుసుమను శెనగ లేదా ధనియాలతో అంతరపంటగా సాగు చేస్తే అధిక నికర ఆదాయాన్ని పొందవచ్చు.




Tuesday, October 4, 2022

రాగుల సాగులో మెళకువలు

       దేశంలో వరి, గోధుమ, మొక్కజొన్న తర్వాత చిరుధాన్యాల పంటల్లో విస్తృతంగా పండిస్తున్న పంట "రాగి". రాగుల యొక్క శాస్త్రీయ నామం "ఇల్యుసైన్ కొరకానా"  దీని సాగులో చీడలు తక్కువే. పెట్టుబడి తక్కువ... లాభం ఎక్కువ పొందగలిగే పంటల్లో రాగి ప్రధానమైనది. రాగులలో ఎక్కువ పోషక విలువలు (ఐరన్, కాల్షియం, పీచుపదార్థం, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు) ఉండటంతో మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇసుక, చౌడు భూముల్లో ఈ పంటను సులభంగా సాగుచేయవచ్చు. ఇది కర్ణాటకలో ఒక ముఖ్యమైనటువంటి తృణధాన్యపుపంట.


రాగుల సాగుకు అనుకూలమైన సమయం:

          వీటి సాగుకు రైతులు ఖరీఫ్ లో జూలై నుంచి ఆగష్టు వరకూ, రబీలో అక్టోబర్ నుండి నవంబర్ వరకు, వేసవిలో ఫిబ్రవరి మొదటి వారంలో నాట్లు వేసుకోవాలి. ఈ పంట రసాయన ఎరువులతో పోల్చుకుంటే సేంద్రీయ ఎరువులతో సాగు చేస్తే .... ఎక్కువ దిగుబడి వస్తుంది. పొలం దున్నడానికి ముందే పొలంలో పశువుల ఎరువు చల్లుకొని కలియదున్నాలి.రాగి 100 నుంచి 110 రోజులలో పంట కోతకు వస్తుంది. రైతులు సరైన యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం దేశంలో రాగులకు కనీస మద్దతు ధర నాలుగు వేలకు పైనే ఉంది. 

మెళకువలు:

రాగులను వెదజల్లే పద్ధతి లేదా మడులు ఏర్పాటు చేసుకొని విత్తుకోవాలి. ఎకరాకు 2 కిలోల విత్తనాలు సరిపోతాయి. రాగి లో అధిక దిగుబడినిచ్చే రకాల పట్ల రైతులు ప్రత్యేక దృష్టి సారించాలి. 

రాగుల సాగులో విత్తనశుద్ధి:

     ప్రతి కిలో విత్తనానికి ఒక లీటరు నీటి చొప్పున విత్తనాన్ని 6 గంటలపాటు నీటిలో నాన బెట్టాలి. విత్తనాలను నీటినుండి వడగట్టి తడిగుడ్డలో రెండు రోజులపాటు గట్టిగా కట్టాలి. రెండు రోజుల తర్వాత తడిగుడ్డ నుండి విత్తనాలను తీసివేయాలి. అవి మొలకెత్తే సంకేతాన్ని చూపిస్తాయి. వాటిని రెండు రోజులపాటు నీడలో ఆర బెట్టాలి.  

      రాగి లో మారుతీ రకం మేలైనదిగా చెప్పవచ్చు. ఈ రకం 80 నుంచి 90 రోజుల్లోనే పంట వస్తుంది. ఇది 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. వేగావతి సువర్ణముఖీ రకాలు అన్ని రకాల నేలల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. వీటితో 14 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు. వకుళ, భారతి, శ్రీ చైతన్య, హిమ అధిక దిగుబడినిస్తూ అగ్గితెగులు తట్టుకుంటూ అన్ని ప్రాంతాల్లో సాగు చేసేలా ఉంటాయి. మొక్కల సాలు మధ్యదూరం 30 సెంటి మీటర్లు , మొక్కల మధ్య దూరం 15  సెంటి మీటర్లు పాటించాలి.

         చేనులో ఎక్కువగా తెగులు ఏర్పడితే గింజలు తాలుగా మారుతాయి. కాబట్టి రైతులు జాగ్రత్తలు తీసుకుంటూ పొలాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. వెర్రి కంకి తెగులు చెను వేసిన ౩౦ రోజుల దశనుంచే వచ్చే అవకాశం ఉంది. ఇది వ్యాపిస్తే గింజలు ఆకులుగా మారుతాయి. దీంతో గింజలు సరిగా ఏర్పడవు. చేను పై గింజలు ముదురు రంగులోకి మారిన తర్వాతనే పంట కోతలు చేపట్టాలి. ఆ తర్వాత కంకులను ఒక చోటికి చేర్చి ట్రాక్టర్తో తొక్కించడం లేదా కర్రలతో కొట్టాలి. దీంతో కుప్ప నూర్చడం సులభం అవుతుంది. 


ఒకవేళ ఇది మీకు నచ్చితే : రాగి జావ తాగటం వల్ల ప్రయోజనాలు

Saturday, October 1, 2022

పొద్దుతిరుగుడు లో చీడలు

తెలుగు రాష్ట్రాల్లో నూనె గింజల సాగు అంటే మొదట గుర్తొచ్చేది వేరుశనగ. ఆ తర్వాత అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంట పొద్దుతిరుగుడు పంట. ఈ సాగులో ప్రధానంగా వచ్చే చీడపీడల నివారణ చర్యల గురించి తెలుసుకుందాం..!


శనగపచ్చ పురుగు:

పొద్దు తిరుగుడు పంటకు ముఖ్యంగా శనగపచ్చ పురుగు ఆశిస్తుంది. మొక్కలు పుష్పించే దశలో పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు గింజలు, పువ్వులు, ఆకులు పైకి చేరి వాటిని తింటూ నష్టాన్ని కలుగజేస్తాయి. 

నివారణ:  

ఈ పురుగు నివారణకు ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. పురుగు యొక్క ఉద్ధృతిని బట్టి ధయోడికార్బ్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని సమూలంగా నిర్మూలించవచ్చు.

తెల్ల దోమ:

తెల్ల దోమ విషయానికొస్తే మొక్క రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతుంది. మొక్క యొక్క 5 నుండి 6 ఆకుల దశ నుండి రసం పీల్చే కీటకాలు కనిపించే అవకాశం ఉంది.  

నివారణ: 

వీటి నివారణకు థయోమిథాక్సామ్ 0.5 గ్రా, 5 మి.లీ. వేప నూనెను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఇమిడాక్లోప్రిడ్‌ 8 గ్రా. కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా నాటిన 20-30 రోజుల వరకు రసంపీల్చే పురుగుల ఉద్ధృతిని తగ్గించుకోవచ్చు.

బూడిద తెగులు:

వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో బూడిద తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. బూడిద తెగులు ఆకులపైన, ఆకుల అడుగుభాగాన బూడిద వంటి పొడితో కప్పబడి ఉంటాయి.తెగులు ఉద్ధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి.

నివారణ: 

దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ, డైనోకాప్ లేదా 2 మి.లీ, హెక్సాకొనజోల్ కలిపి పిచికారి చేయాలి.

పొగాకు లద్దెపురుగు:

పైరు మొదటి దశలో ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయడం వల్ల ఉద్ధృతిని తగ్గించవచ్చు. 

నివారణ: 

పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్న యెడల నొవాల్యూరాన్ 1 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేక విషపు ఎరను 5 కి. తౌడు + 1/2 కిలో బెల్లం + 1/2 లీ. మోనోక్రోటోపాస్ లేక క్లోరిపైరిఫాస్ ఉండలుగా తయారుచేసి సాయంత్రం వేళల్లో పొలంలో అక్కడక్కడ వేయాలి.


తామర పురుగులు బిహారీ గొంగలిపురుగు మొక్క ఆకులను తిని అపారమైన నష్టాన్ని కలుగజేస్తాయి. ఇవి మొక్క మొదటి దశ నుంచి ఆశిస్తాయి. ఈ మొక్క లేత భాగాలను ఆశించి మొక్క ఎదగకుండా చేస్తాయి.

నెక్రోసిస్ తెగులు:

ఈ తెగులు తామర పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కల పువ్వులు విచ్చుకోకుండా మెలిక తిరిగి వంకరగా మారుతాయి.

నివారణ: 

వీటి నివారణలో పార్టీనియం కలుపును తీసివేయుట మరియు ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ లేదా థయోమిథాక్సామ్ 0.5 గ్రా. లీటరు నీటికి కలిపి రెండు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే తెగులును అదుపులో ఉంచవచ్చు.

పచ్చ దీపపు పురుగు మాత్రం ఆకు అడుగు భాగంలో ఉండి ఆకు రసాన్ని పీల్చేస్తుంది. దీంతో ఆకులు ముడుచుకొని పసుపురంగులోకి మారతాయి.  

ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు:

ఆకుపై నల్లని గుండ్రని మచ్చలు ఏర్పడుతాయి. కాండంపై మరియు ఆకుతొడిమిపై పువ్వు క్రింది భాగాన గోధుమ వర్ణపు మచ్చలు లేక చారలు ఏర్పడుతాయి. ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసి పెద్ద మచ్చలుగా ఏర్పడి వ్యాధి సోకిన భాగాలు చనిపోతాయి. వ్యాధి తీవ్రంగా ఉ న్నప్పుడు ఆకులు రాలిపోవడం మరియు కాండం విరిగి పోవడం జరుగుతుంది. విత్తనాల ద్వారా ఈ శిలీంధ్రం వ్యాపించినప్పుడు విత్తనాలు కుళ్లుటం లేక మొలక ఎండుతెగులు లక్షణాలు కనిపిస్తాయి. బీజ దళాలపై మరియు వేరు భాగాలపై నల్లని మచ్చలు ఏర్పడడం వలన వేర్లు కుళ్లి మొలకలలో నానుడి తెగులు లక్షణాలు కనిపిస్తాయి. ఈ శిలింధ్రం. విత్తనాలు మరియు మొక్కల అవశేశాల్లో జీవిస్తుంది. ఈ తెగులు గాలి ద్వారా ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తేమతో కూడిన వేడి వాతావరణం’ ఈ వ్యాధి వృద్ధికి అనువైoది.

నివారణ: 

పంట అవశేషాలను శిలీంధ్రానికి అశ్రయమిచ్చే ఇతర కలుపుమొక్కలను నివారించాలి. కాప్టాన్ 3 గ్రా/1 కె.జి. విత్తనాలకి కలిపి విత్తన శుద్ధి చేయాలి.తెగులు గమనించిన వెంటనే మాంకోజిబ్ 0.25% మందు 2 సార్లు పిచికారీ చేయాలి.


NOTE: 

పొలంలో విత్తడానికి ముందే విత్తన శుద్ధి చేసే విధానం ద్వారా పురుగుల బెడద నుంచి కాపాడుకోవచ్చు.

సులభంగా సుబాబుల్ సాగు

     సుబాబుల్ మొక్క శాస్త్రీయ నామం ల్యూకేనా ల్యూకోసెఫాలా (Leucaena leucocephala). పశుగ్రాసంగా పాడి వ్యర్ధభూముల్లో (బంజరు భూముల్లో) సుబాబుల్‌ను  విస్తృతంగా సాగుచేస్తారు. సుబాబుల్‌ ఆకులను పశువులకు పచ్చిమేతగా ఉపయోగించడమే కాకుండా పేపర్ తయారీకి కూడా ఉపయోగిస్తుండటంతో వీటికి డిమాండ్ అధికంగా ఉంది. ఈ మొక్కలను సాగు చేయాలనుకునే రైతులు వానాకాలంలో సాగు చేస్తే మొక్కలు త్వరగా పెరుగుతాయి. మొక్క త్వరగా ఎదగటానికి మనం చిగురును తుంచే కొద్దీ చెట్టు కాండం సైజు పెరుగుతూ తిరిగి కొమ్మలు ఎక్కువ వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాతావరణ పరిస్థితులు ఈ సాగు కి అనుకూలిస్తాయి. కాబట్టి ఈ మొక్కలను సులువుగా సాగు చేయవచ్చు. 


నేలలు:

     ఈ మొక్క అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. లోతైన, సారవంతమైన, ఎక్కువ తేమ లభ్యమయ్యే నేలలు వీటికి మరింత అనుకూలంగా ఉంటాయి. అటవీ వ్యవసాయ పద్ధతిలో పంట పొలాల్లో కూడా వీటిని పెంచవచ్చు. 

నారు మొక్కల పెంపకం:

      బాగా ఎదిగిన మొక్కల నుంచి విత్తనాలు సేకరించాలి. ఒక కిలోకు 16,000 నుంచి 20,000 విత్తనాలు ఉంటాయి. సీడ్ క్లీనింగ్ కోసం, ఈ విత్తనాలను 30 డిగ్రీల సెల్సియస్ వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచాలి మరియు వేడి నీటి నుండి తీసిన విత్తనాన్ని 12 గంటలు చల్లని నీటిలో నానబెట్టి విత్తుకోవాలి. విత్తన శుద్ధి తర్వాత నారుమళ్ళలో (లేదా) పాలిథీన్ సంచుల్లో నాటుకోవచ్చు. ఈ విత్తనాలను మార్చి ఏప్రిల్ నెలల్లో విత్తినట్లయితే వర్షాకాలంకల్లా మొక్కలు నాటటానికి తయారవుతాయి.

నాటే పద్ధతి:

         ఈ మొక్కలను సాగు చేసే రైతులు మొక్కల మధ్య దూరం ఎక్కువగా పాటించాలి. ఇవి ఎత్తుగా పెరుగుతాయి కాబట్టి వరుసల మధ్య కనీసం 2 నుంచి 4 మీటర్ల దూరం పాటించాలి. ఎకరాకు 700 నుండి 1000 మొక్కల వరకు నాటుకోవచ్చు. మొక్కలు నాటిన మొదటి రెండేళ్ల వరకూ అంతర పంటలు వేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి చెట్ల ఎదుగుదల ఆధారంగా 2 నుంచి 5 ఏళ్లలో చెట్లను నరక వచ్చు. సుబాబుల్ ఆరేళ్లలో 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వర్షాధార ప్రాంతాల్లో సాధారణంగా కలప దిగుబడి ఎక్కువగా వస్తుంది. పశుగ్రాసం ఎకరాకు వర్షాధార ప్రాంతాల్లో 5 నుంచి 10 టన్నులు, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 32 నుంచి 36 టన్నుల దిగుబడి వస్తుంది. కాగితం తయారీకి కావలసిన శ్రేష్టమైన గుజ్జు నుంచి లభిస్తుంది. ఈ కలపను, ఆకులను, వంటచెరకుగా, నారగా మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు. మొక్క తక్కువ కాలంలోనే పెరుగుతుంది కాబట్టి ఈ సాగు చేసిన రైతులు సులభంగా లాభాలు పొందవచ్చు.

పచ్చిరొట్ట:

        ఖరీదైన నత్రజని ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు సుబాబుల్‌ను పచ్చని పచ్చిరొట్టగా ఉపయోగించవచ్చు. పచ్చిరొట్టగా వాడితే ఎకరానికి 8 నుంచి 12 కిలోల నత్రజని లభిస్తుంది. అంతర పంటల ద్వారా నత్రజని అవసరాన్ని 50 శాతం తగ్గించుకోవచ్చు.

సమస్యలు - పరిష్కారం:

            పశుగ్రాసం లా పనికి వస్తుంది కనుక మొదటి సంవత్సరం మొక్కలను పశువులు, మేకల బారి నుండి కాపాడుకోవాలి. "మిమోసిన్" అనేది లేత ఆకుల్లో ఎక్కువగా ఉన్నందున సుబాబుల్ రెమ్మలను ఇతర మేతతో మేపాలి.  ఈ చెట్లకు సహజ పునరుత్పత్తి అధిక రేట్లు ఉండటం వలన చివరకు కలుపు మొక్కలుగా మిగలవచ్చు. దీదీనిని నివారించడానికి, తరచుగా అంతరకృషి చేయాలి.
@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates