Tuesday, April 22, 2025

LATEST UPDATES
>> కోళ్ళలో వైరస్ ల ప్రభావంతో వచ్చే వ్యాధులు! తీసుకోవాల్సిన జాగ్రత్తలు  >> కోళ్లలో వచ్చే పుల్లోరం వ్యాధి లక్షణాలు మరియు యాజమాన్యం  >> అల్లం సాగు విధానం, రకాలు, యాజమాన్య పద్ధతులు, ఎరువులు, మరియు సస్యరక్షణ  >> రబీలో 'కుసుమ' సాగు  >> రాగుల సాగులో మెళకువలు    

Wednesday, September 28, 2022

మేలైన పాలు పితికే విధానం

         భారతదేశంలో పాలు పితకడానికి "చేతితో పాలు పితికే విధానం" (మాన్యువల్ మిల్కింగ్) మరియు "యంత్రంతో పాలు పితికే విధానం" (మెషిన్ మిల్కింగ్) అనే రెండు పద్ధతులు ఉన్నాయి.

చేతితో పాలు పితికే విధానం (మాన్యువల్ మిల్కింగ్):

       పాడి పశువులకు సరైన విధానంలో పాలు తీయకపోతే తక్కువ పాలు వచ్చే అవకాశాలున్నాయి. చేతితో పాలను పితకాలనుకొనే రైతులు ఫుల్ హ్యాండ్ పద్దతి, స్ట్రిప్పింగ్ పద్దతి, నక్లింగ్ పద్ధతులను అనుసరించాలి.

          వీటిలో ఫుల్ హ్యాండ్ పద్దతి మెరుగైనది. పాలు పితకడానికి ఈ పద్దతి సులువుగా ఉంటుంది. ఫుల్ హ్యాండ్ పద్దతిలో ఎక్కువ పాలు పితకవచ్చు. మొత్తం ఐదు వేళ్లతో చనుమొనను పట్టుకుని, అరచేతికి వ్యతిరేకంగా నొక్కుతూ పూర్తిగా చేతితో పాలు పితకటం జరుగుతుంది.

                   నక్లింగ్ పద్దతిలో చేతి బొటనవేలు, ఇతర నాలుగు వేళ్ల సహాయంతో పితుకుతారు, కాబట్టి ముఖ్యంగా పాలు పితికే వారి వేళ్లకు గోర్లు లేకుండా చూసుకోవాలి. లేదంటే చనులకు గోర్లు గుచ్చుకుని గాయం అవుతాయి. 

          స్ట్రిప్పింగ్ పద్దతిలో బొటనవేలు, చూపుడు వేళ్లతో పాలు పితుకుతారు. ఈ విధానంలో బొటనవేలు మరియు చూపుడు వేలు మధ్య చనుమొనను గట్టిగా పట్టుకొని చనుమొన పొడవునా క్రిందికి లాగడం మరియు అదే సమయంలో పాలు ప్రవాహంలో ప్రవహించేలా నొక్కడం ద్వారా  పాలు పితుకుతారు. ఈ పద్దతిలో గేదె లేదా ఆవు రొమ్ములో ఉన్న పాలను అన్నింటిని పితకటానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో పశువులకు రొమ్ము నొప్పి రాదు. 



ఫుల్ హ్యాండ్ పద్ధతి, స్ట్రిప్పింగ్ పద్దతి కంటే మెరుగైనది. ఇది దూడ ద్వారా సహజంగా పాలిచ్చే ప్రక్రియను ప్రేరేపిస్తుంది మరియు ఆవులు మరియు గేదెల పెద్ద చనుమొనలపై ఈ పద్ధతి సమానమైన ఒత్తిడిని కలిగిస్తుంది. 

Wednesday, September 14, 2022

కోళ్లకు వచ్చే పౌల్ పాక్స్ వ్యాధి - నివారణ

 

          పౌల్ పాక్స్ అనేది టీకాలు వేయని పెరటి కోళ్లలో ఎక్కువగా వచ్చే సాధారణ వ్యాధి. ఈ వ్యాధినే అమ్మవారు పోసింది అని అంటారు. ఈ వ్యాధికి గురైన కోళ్ల శరీరం అంతా గుల్లలు వచ్చి చర్మానికి బొక్కలు పడుతుంది. అలాగే కోడి శరీరం వేడిగా ఉండి, బరువు తగ్గుతుంది. కొన్ని కోళ్లు చనిపోయే అవకాశం ఉంది. ఇది వైరల్ డిసీజ్ కావటంతో వీటికి తక్కువ మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాధికి పల్సాజోన్ అనే మందు అందుబాటులో  ఉంది. ఈ మందు అందించినప్పటికీ, వ్యాధి తగ్గడానికి 20 రోజులు టైం పడుతుంది. పల్సాజోన్ రోజూ ఉదయం, సాయంత్రం అందిస్తుండాలి. ఈ మందు వ్యాధిని తగ్గించటమే కాకుండా వ్యాధి వ్యాపించకుండా ఉంచుతుంది. ప్రస్తుతం ఈ వ్యాధికి ఇంకో మందు  జెల్ అందుబాటులో  ఉంది. 

పౌల్ పాక్స్  లో 2 రకాలు ఉన్నాయి: వెట్ పాక్స్ మరియు డ్రై పాక్స్

డ్రై పాక్స్ సాధారణం మరియు మొటిమలు వంటి విస్ఫోటనాలుగా అభివృద్ధి చెందుతుంది. కండగల లేత ముద్దలు పసుపు మొటిమలను ఏర్పరుస్తాయి, ఇవి పెరుగుతాయి మరియు పసుపు క్రస్ట్‌లను ఏర్పరుస్తాయి. ఈ స్కాబ్‌లు నల్లగా మారి వారం రోజుల్లో రాలిపోతాయి.

వెట్ పాక్స్ (డిఫ్థెరిటిక్) నోరు, ముక్కు మరియు కొన్నిసార్లు గొంతు ప్రాంతాల్లో వ్రణోత్పత్తి చీజీ మాస్‌గా ఏర్పడుతుంది, ఇది తినడం మరియు శ్వాస తీసుకోవడంలో అంతరాయం కలిగిస్తుంది.


ద్రాక్ష పండిద్దామా


          నూతన పంటలను పండించాలనుకొనే రైతులకు "ద్రాక్ష" ఒక మంచి ప్రత్యామ్నాయ పంట. ద్రాక్ష సాగు విధానం పూర్తిగా తెలుసుకుని సాగు ప్రారంభిస్తే... ఈ పంట లో ఎప్పుడూ చూడని లాభాలు పొందవచ్చని రైతులు చెబుతున్నారు. ముందుగా మొక్కల ఎంపిక అన్నది ఎంతో ప్రధానమైనది. ఇప్పటికే సాగు చేస్తున్న రైతులను సంప్రదించి ఏ ఏ రకాల మొక్కలతో లాభం పొందవచ్చనే విషయాన్ని తెలుసుకోవాలి. 

          ద్రాక్షలో రకాల విషయానికి వస్తే సూపర్ సోన, మాణిక్ చమన్ వంటివి ప్రధానమైనవి. వీటిలో సూపర్ సోన వెరైటీ తెలుగు రాష్టాల్లో అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏ రకం మొక్క.. వర్షం పడినప్పుడు కాయ పగిలి, చేనంతా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వాతావరణానికి అనుకూలమైన మొక్కలు నాటుకోవాలి. మొక్కలను ఎకరానికి 1000 వరకు నాటుకోవాలి. మొక్కల మధ్య దూరం 10X4 ఉండేలా చూడాలి. ఇది తీగరకం పంట. కాబట్టి పొలంలో ౩౦౦ వరకు స్తంభాలు పాతుకొని గాలికి, వర్షానికి పడిపోకుండా, పందిరి కూలిపోకుండా ఏర్పాటు చేయాలి. ఎకరా ద్రాక్ష పంట కు దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది. ద్రాక్ష మొక్కలు నాటిన 16 నుంచి 18 నెలలకు కాపు మొదలవుతుంది. కాపు అందుకున్న అప్పటి నుంచి ఒక ప్రతిరోజు నీరు అందించాలి. ద్రాక్ష పంట మొదటి కాపు నుంచే ఎకరానికి 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పంట ధర విషయానికి వస్తే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో టన్నుకు దాదాపు 45 వేల నుంచి 50 వేల వరకు ఉంటుంది. నవంబర్ డిసెంబర్ నెలలో కాస్త తగ్గి టన్ను 35 వేల నుంచి 40 వేల వరకు వస్తుంది. ధర హెచ్చుతగ్గులకు రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 

ద్రాక్షలో తెగుళ్లు:

డోన్ మిల్లి, పౌడర్ మిల్లి ద్రాక్షలో ప్రధాన తెగుళ్ళు. వేసవిలో పేనుబంక, డోలియో తెగుళ్లు వంటివి వస్తాయి. వీటి నివారణకు పురుగు మందులు స్ప్రే  చేసుకోవాలి. పురుగు మందులు స్ప్రే చేసుకునే సమయంలో పంట మీద నీరు లేకుండా చూడాలి. పంటపై నీరు ఉంటే కాయ పాడవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మొక్క పాదుల్లో నీరు నిలువకుండా చూడాలి ఎందుకంటే వర్షాలకు పంట అవుతుంది. ఈ పంట 40 డిగ్రీల వరకు వేడి తట్టుకుంటుంది. పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, వేపచెక్క కలుపుకొని మొక్కలకు అందించాలి. తోటలో కలుపు రాకుండా ఉండాలంటే ఏడాదికి కనీసం 2-3  తోటను ట్రాక్టర్‌తో దున్నాలి. ఎక్కువ సార్లు దున్నినా, మొక్కకు దగ్గరగా దున్నినా.. మొక్క వేర్లు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలతో సాగు చేయాలి. 


ఒకవేళ ఇది మీకు నచ్చితే : ఎండుద్రాక్షతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు


Sunday, September 11, 2022

రిడ్జ్ ప్లాస్టరింగ్ మెషిన్ తో గట్లు కట్టేద్దాం


          కాలం మారుతున్న కొద్దీ వ్యవసాయంలో నూతన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రైతుల పనులు సులభంగా చేసేలా ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. వ్యవసాయంలో ప్రధానంగా గట్లు చెక్కడం రైతుకి శ్రమతో కూడుకున్నది. ఎందుకంటే పొలం చుట్టూ ఉండే గట్లు చెక్కడమే కాకుండా వాటికి మళ్లీ మట్టి అద్దాల్సిన పని ఉంటుంది. ఈ శ్రమను తగ్గించేందుకు ఇప్పుడు మార్కెట్‌లో గట్లు తయారు చేసే యంత్రం (Ridge Plastering Machine) అందుబాటులోకి వచ్చింది. 

          ఈ యంత్రం పొలంలోని గట్లు చెక్కడమే కాకుండా గట్టు ఎత్తు పెంచి ఒడ్డుపై మట్టి కూడా పెడుతుంది. ముఖ్యంగా రైతు కూలీలకు ఇచ్చే అదనపు ఖర్చు కూడా ఆదా అవుతుంది. ఈ గట్లను రైతు ఎకరంన్నర నుంచి రెండు ఎకరాల వరకు రోజంతా చెక్కుతాడు. అదే రిడ్జ్ ప్లాస్టరింగ్ యంత్రంతో రోజుకు దాదాపు 30 నుంచి 40 ఎకరాలు గట్లు చెక్కడం, అద్దడం పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం ఈ యంత్రం మార్కెట్లో 3.50  లక్షల వరకు అందుబాటులో ఉంది. ఈ యంత్రం ట్రాక్టర్ కి అనుసంధానించి ఉంటుంది. ప్రస్తుతం ఈ మెషిన్ తో గట్లు సరిచేయిస్తే ఎకరాకు  500 నుండి 1000 వరకు తీసుకొంటున్నారు.ఎక్కువ పొలం ఉన్న రైతులు దీని ఉపయోగించి సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చు. గట్టు సైజు, ఎత్తు ఆధారంగా మెషిన్ ని సెట్ చేసుకోవచ్చు. 

    



Saturday, September 10, 2022

మిరపనారు పోద్దామా

            కాలానుగుణంగా పండించే పంటల్లో మిరప ప్రధానమైనది. ఈ నేపథ్యంలో  మిరప సాగు చేయాలనుకొంటున్న రైతులు సెప్టెంబర్ నెలలో మిరపనారు పోస్తేనే మనకు సరైన సమయంలో పంట చేతికి వస్తుంది. కాబట్టి మిరప నారుపోయటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.


 



          ముందుగా మీకు ఒక ఎకరా పొలం ఉంది అనుకొంటే, ఈ ఎకరా చేనులో మిరప సాగుచేయాలనుకొంటే ముందుగా నారు మడులను ఏర్పాటుచేయాలి. వాటికి నీరు సులభంగా అందేలా కాలువలు చేసి మడులను చదును చేసుకోవాలి. ఆ తరువాత నారుపోయటానికి ముందే ఓసారి నీరు పెట్టి అందులో ఎకరా చేనుకు సరిపోయేలా 100 గ్రాముల విత్తనాలు వేసి వాటిపై పొడి మట్టి చల్లాలి. మనం వేసిన విత్తనాలు 9-10 రోజుల తరువాత మొలకెత్తుతాయి అంతవరకూ నీరు ఆరుతడిగా పెట్టాలి. ఎక్కువ నీరు పెడితే విత్తనాలు కుళ్లిపోతాయి కావున నీటి తడి విషయం లో  జాగ్రత్త వహించాలి. మడుల్లో విత్తనాలు మొలకెత్తిన తరువాత కూడా మొక్కలు కొంత పెద్ద అయ్యేవరకు నీరు ఆరుతడిగా పెట్టాలి. మొక్కలు త్వరగా పెరగటానికి తగిన మోతాదులో సేంద్రియ ఎరువులు అందించాలి.

          నారు ఎదిగి... చేలో నాటుకొనే సమయంలో మొక్క తలభాగం తుంచుకొంటే చేనులో మొక్క బలంగా నిల్చుంటుంది. విత్తనాలు విత్తిన 40-45 రోజులకు నాటు వేయాలి. ఒక ఎకరంలో 14-15 వేల మొక్కలు నాటవచ్చు. విత్తనాలు విత్తినప్పటినుంచి నాట్లు వేసుకునే వరకు దాదాపు ₹6 - ₹7 వేల వరకు ఖర్చు ఉంటుంది. నాట్లు వేసుకునే సమయంలో మొక్కల మధ్య దూరం 2X1 ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మొక్క మధ్య దూరంపాటిస్తే మొక్క ఎంత పెరిగినా కొమ్మలు అంటుకోకుండా ఉంటాయి. కలుపుతీసుకోవటం సులువుగా ఉంటుంది, మనం వేసే ఎరువు మొక్కలకు సంపూర్ణంగా అందుతుంది.



@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates