LATEST UPDATES
Showing posts with label Farming. Show all posts
Showing posts with label Farming. Show all posts

Tuesday, October 7, 2025

🌾సులభంగా విత్తనం నాటే 'హ్యాండ్ పుష్ సీడర్'


        రైతులు సాధారణంగా విత్తనాలు కూలీల సాయంతో చేతితో నాటేవారు. అయితే కూలీల కొరత, ఖర్చు పెరగడం వంటి సమస్యలతో వ్యవసాయంలో విత్తనాలు నాటడం ఒక కష్టమైన ప్రక్రియగా మారింది. ఈ సమస్యను అధిగమించటానికి సులభంగా విత్తనాలను నాటే యంత్రం అయినటువంటి 'హ్యాండ్ పుష్ సీడర్' అందుబాటులోకి వచ్చింది. దీని సహాయంతో ఒక మనిషి రోజుకు రెండు నుండి నాలుగు ఎకరాల వరకు విత్తనాలు నాటుకోవచ్చు. మొక్కకు మొక్కకు దూరం (Row Spacing) కోసం విత్తనం ఎంత దూరంలో కావాలంటే అంట దూరంలో పడేలా అడ్జెస్ట్ చేసుకొనే అవకాశం దీనిలో ఉంది. ప్రత్తి, కూరగాయలు, మొక్కజొన్న, ఆముదం సహా ఇతర విత్తనాలు నాటవచ్చు.

⚙️ హ్యాండ్ పుష్ సీడర్ వాడే విధానం:

  • నేలను ముందుగా తగిన విధంగా సంసిద్ధం చేయాలి.

  • విత్తనాన్ని సీడర్‌లో లోడ్ చేయాలి.

  • యంత్రాన్ని నెట్టడం ద్వారా విత్తనాలు సమానంగా నేలలో పడతాయి.

  • విత్తనాల రకం ఆధారంగా స్పేసింగ్ సర్దుబాటు చేయాలి.

🧰 నిర్వహణ సూచనలు:

        ఈ యంత్రంలో సాధారణంగా తక్కువ విడి భాగాలు ఉంటాయి; కాబట్టి తక్కువ కొనుగోలు ఖర్చు, మరమ్మత్తు చేయడం సులభం. నిర్వహణ (Maintenance) కూడా (ఆయిల్ చేయడం, భాగాల శుభ్రత) చాలా సులభం. 

💡 రైతులకు లాభాలు:

  • సమయం మరియు కూలీ ఖర్చు తగ్గింపు

  • సమానమైన మొలకలు

  • పంట ఉత్పాదకత పెరుగుతుంది

  • తక్కువ పెట్టుబడితో అధిక ఫలితాలు

Wednesday, September 14, 2022

ద్రాక్ష పండిద్దామా


          నూతన పంటలను పండించాలనుకొనే రైతులకు "ద్రాక్ష" ఒక మంచి ప్రత్యామ్నాయ పంట. ద్రాక్ష సాగు విధానం పూర్తిగా తెలుసుకుని సాగు ప్రారంభిస్తే... ఈ పంట లో ఎప్పుడూ చూడని లాభాలు పొందవచ్చని రైతులు చెబుతున్నారు. ముందుగా మొక్కల ఎంపిక అన్నది ఎంతో ప్రధానమైనది. ఇప్పటికే సాగు చేస్తున్న రైతులను సంప్రదించి ఏ ఏ రకాల మొక్కలతో లాభం పొందవచ్చనే విషయాన్ని తెలుసుకోవాలి. 

          ద్రాక్షలో రకాల విషయానికి వస్తే సూపర్ సోన, మాణిక్ చమన్ వంటివి ప్రధానమైనవి. వీటిలో సూపర్ సోన వెరైటీ తెలుగు రాష్టాల్లో అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏ రకం మొక్క.. వర్షం పడినప్పుడు కాయ పగిలి, చేనంతా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వాతావరణానికి అనుకూలమైన మొక్కలు నాటుకోవాలి. మొక్కలను ఎకరానికి 1000 వరకు నాటుకోవాలి. మొక్కల మధ్య దూరం 10X4 ఉండేలా చూడాలి. ఇది తీగరకం పంట. కాబట్టి పొలంలో ౩౦౦ వరకు స్తంభాలు పాతుకొని గాలికి, వర్షానికి పడిపోకుండా, పందిరి కూలిపోకుండా ఏర్పాటు చేయాలి. ఎకరా ద్రాక్ష పంట కు దాదాపు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది. ద్రాక్ష మొక్కలు నాటిన 16 నుంచి 18 నెలలకు కాపు మొదలవుతుంది. కాపు అందుకున్న అప్పటి నుంచి ఒక ప్రతిరోజు నీరు అందించాలి. ద్రాక్ష పంట మొదటి కాపు నుంచే ఎకరానికి 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పంట ధర విషయానికి వస్తే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో టన్నుకు దాదాపు 45 వేల నుంచి 50 వేల వరకు ఉంటుంది. నవంబర్ డిసెంబర్ నెలలో కాస్త తగ్గి టన్ను 35 వేల నుంచి 40 వేల వరకు వస్తుంది. ధర హెచ్చుతగ్గులకు రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 

ద్రాక్షలో తెగుళ్లు:

డోన్ మిల్లి, పౌడర్ మిల్లి ద్రాక్షలో ప్రధాన తెగుళ్ళు. వేసవిలో పేనుబంక, డోలియో తెగుళ్లు వంటివి వస్తాయి. వీటి నివారణకు పురుగు మందులు స్ప్రే  చేసుకోవాలి. పురుగు మందులు స్ప్రే చేసుకునే సమయంలో పంట మీద నీరు లేకుండా చూడాలి. పంటపై నీరు ఉంటే కాయ పాడవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మొక్క పాదుల్లో నీరు నిలువకుండా చూడాలి ఎందుకంటే వర్షాలకు పంట అవుతుంది. ఈ పంట 40 డిగ్రీల వరకు వేడి తట్టుకుంటుంది. పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, వేపచెక్క కలుపుకొని మొక్కలకు అందించాలి. తోటలో కలుపు రాకుండా ఉండాలంటే ఏడాదికి కనీసం 2-3  తోటను ట్రాక్టర్‌తో దున్నాలి. ఎక్కువ సార్లు దున్నినా, మొక్కకు దగ్గరగా దున్నినా.. మొక్క వేర్లు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలతో సాగు చేయాలి. 


ఒకవేళ ఇది మీకు నచ్చితే : ఎండుద్రాక్షతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు


Saturday, September 10, 2022

మిరపనారు పోద్దామా

            కాలానుగుణంగా పండించే పంటల్లో మిరప ప్రధానమైనది. ఈ నేపథ్యంలో  మిరప సాగు చేయాలనుకొంటున్న రైతులు సెప్టెంబర్ నెలలో మిరపనారు పోస్తేనే మనకు సరైన సమయంలో పంట చేతికి వస్తుంది. కాబట్టి మిరప నారుపోయటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.


 



          ముందుగా మీకు ఒక ఎకరా పొలం ఉంది అనుకొంటే, ఈ ఎకరా చేనులో మిరప సాగుచేయాలనుకొంటే ముందుగా నారు మడులను ఏర్పాటుచేయాలి. వాటికి నీరు సులభంగా అందేలా కాలువలు చేసి మడులను చదును చేసుకోవాలి. ఆ తరువాత నారుపోయటానికి ముందే ఓసారి నీరు పెట్టి అందులో ఎకరా చేనుకు సరిపోయేలా 100 గ్రాముల విత్తనాలు వేసి వాటిపై పొడి మట్టి చల్లాలి. మనం వేసిన విత్తనాలు 9-10 రోజుల తరువాత మొలకెత్తుతాయి అంతవరకూ నీరు ఆరుతడిగా పెట్టాలి. ఎక్కువ నీరు పెడితే విత్తనాలు కుళ్లిపోతాయి కావున నీటి తడి విషయం లో  జాగ్రత్త వహించాలి. మడుల్లో విత్తనాలు మొలకెత్తిన తరువాత కూడా మొక్కలు కొంత పెద్ద అయ్యేవరకు నీరు ఆరుతడిగా పెట్టాలి. మొక్కలు త్వరగా పెరగటానికి తగిన మోతాదులో సేంద్రియ ఎరువులు అందించాలి.

          నారు ఎదిగి... చేలో నాటుకొనే సమయంలో మొక్క తలభాగం తుంచుకొంటే చేనులో మొక్క బలంగా నిల్చుంటుంది. విత్తనాలు విత్తిన 40-45 రోజులకు నాటు వేయాలి. ఒక ఎకరంలో 14-15 వేల మొక్కలు నాటవచ్చు. విత్తనాలు విత్తినప్పటినుంచి నాట్లు వేసుకునే వరకు దాదాపు ₹6 - ₹7 వేల వరకు ఖర్చు ఉంటుంది. నాట్లు వేసుకునే సమయంలో మొక్కల మధ్య దూరం 2X1 ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మొక్క మధ్య దూరంపాటిస్తే మొక్క ఎంత పెరిగినా కొమ్మలు అంటుకోకుండా ఉంటాయి. కలుపుతీసుకోవటం సులువుగా ఉంటుంది, మనం వేసే ఎరువు మొక్కలకు సంపూర్ణంగా అందుతుంది.