అల్లం జింజిబరేసి (Zingiberaceae) కుటుంబానికి చెందిన దుంప జాతి ఔషధ మొక్క. అల్లం శాస్త్రీయ నామం జింజర్ అఫిసినెల్ దీన్ని ఆంగ్లంలో జింజర్ అంటారు. విస్తీర్ణం మరియు ఉత్పత్తి పరంగా, మన దేశం (23%), చైనా (24%) తర్వాత రెండవ స్థానంలో ఉంది.
లాభాలు పొందే పంటల్లో అల్లం సాగు ప్రధానమైనది. అతితక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పంట అల్లం. ఇది దుంప రకానికి చెందినది. దీనిని పచ్చి దశలో అల్లం గా ఎండిన తరువాత శొంఠిగా వినియోగిస్తుండటంతో దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ పంటను శీతాకాలంలో సాగు చేసి మంచి దిగుబడులు పొందవచ్చు. తక్కువ స్థలంలో ఎక్కువ లాభాలు పొందాలనుకుంటే ఇది అనువైన పంట గా చెప్పవచ్చు. అల్లం విత్తుకోవాలంటే కిందట పంట నుంచి తీసిన దుంపలను కూడా విత్తనంగా వాడుకోవచ్చు. ఇందులో గామారన్, రియో-డి-జెనేరియో,బైరి, తుని, సుప్రభ, సురుచి, రకాలు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. ముఖ్యంగా తెగుళ్లు సోకని రకాలు ఎంపికచేసుకోవాలి.
అల్లం సాగుకు నేల ఉదజని సూచిక (pH) 6.0-6.5 ఉన్న అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్ర, నల్ల నేలలు అనుకూలంగా ఉంటాయి. విత్తనపు అల్లంను నెల రోజుల ముందే.. ఆరుబయట గోనెసంచుల కప్పి నీటి తడులు ఇస్తే పూర్తిగా పిలక సిద్ధమౌతుంది. అల్లం విత్తుకోవడానికి ముందే పొలాన్ని మూడుసార్లు దున్నుకోవాలి. ఆ తరువాత పశువుల ఎరువును చల్లుకోవాలి. కూలీల సహాయంతో చేనులో బెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. మొక్కలకు నీరు సమృద్ధిగా అందాలంటే డ్రిప్ లేదా స్ప్రింకర్లను ఏర్పాటు చేయాలి. నీరు నిలిచే భూమిలో మాత్రం దీనిని సాగు చేయకూడదు. అలాంటి నేలలో అల్లం సాగు చేస్తే దుంప కుళ్లు వ్యాధి ఎక్కువగా ఉంటుంది. అల్లం నాణ్యత తక్కువగా ఉంది. సాధారణంగా ఎకరాకు 600 నుంచి 1000 కిలోల విత్తనం సరిపోతాయి. అయితే అల్లం రకం, విత్తే దూరం బట్టి కొంత మార్పు ఉండొచ్చు. విత్తే సమయంలో దుంపల మధ్య 9 ఇంచులు సాళ్ల మధ్య ఒక మీటరు దూరంలో నాటుకోవాలి. ఇది ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పంట.
అల్లం సాగులో విత్తన శుద్ధి ప్రాముఖ్యత:
అల్లం దుంపలను విత్తడానికి ముందు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కొన్ని రకాల వ్యాధులను సమర్థవంతంగా అరికట్టి కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. విత్తన శుద్ధి లో ముందుగా లీటరు నీటికి 3గ్రా, మెటలాక్సిల్ లేదా 3 గ్రా. మ్యాంకోజెబ్ + 5 మి.లీ. క్లోరిపైరిఫాస్ కలిపిన ద్రావణంలో దుంపలను 30-40 నిమిషాలు నానబెట్టి తరువాత తీసి ఆరబెట్టాలి. లీటరు నీటికి 5 గ్రా. చొప్పున ట్రైకోడెర్మా విరిడె కలిపిన ద్రావణంలో ఆరబెట్టిన దుంపలను 30 నుండి40 నిమిషాలు నానబెట్టి విత్తుకోవాలి. దీంతో వేరు కుళ్ళు, దుంప కుళ్ళు మొదలైన వ్యాధులను సమర్ధవంతంగా నివారించవచ్చు.
అల్లం పంటను అంతర పంటగా సాగు చేసే విధానం:
అల్లం పంటను అంతర పంటగా కూడా సాగు చేసి సంవత్సరం పొడవునా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. సాధారణంగా అల్లం పంట వెలుతురు పడే ప్రదేశంలో కంటే నీడపట్టున బాగా పెరిగి నాణ్యమైన దిగుబడిని ఇస్తుంది కావున కొబ్బరి తోటలు సాగుకు మంచి అనుకూలం. అలాగే కాఫీ, అరటి, ద్రాక్ష, నిమ్మ జామ వంటి వివిధ రకాలైన పండ్ల తోటల్లో అల్లంను అంతర పంటగా సాగు చేసి రైతు సోదరులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
అల్లం సాగులో సస్యరక్షణ చర్యలు:
దుంపకుళ్ళు తెగులు: అల్లం సాగులో దుంప కుళ్లు తెగులు రైతులకు అధిక నష్టాన్ని కలగజేస్తుంది. ఈతెగులు ముఖ్యంగా అధికంగా నీరు నిల్వ ఉన్న భూముల్లోను,మురుగు నీటి వసతి లేని భూముల్లో ఎక్కువగా ఆశిస్తుంది. ఎక్కువ వర్షపాతం, నీరు నిలిచే పరిస్థితులు ఈ తెగులుకు అనుకూలం.ఈ తెగులు ఆశించిన దుంపలు మెత్తగా ఉండి కుళ్లిన వాసన వస్తుంది.
ఆకుమచ్చ తెగులు: మొదట ఆకులు పెళుసుగా ఆకులపై అందాకారంలో అనేక నల్లటి మచ్చలు చుక్కలుగా ఆకుల సాయంపై ఏర్పడతాయి. దీని నివారణకు ఏదేని కాపర్ ఆక్సీక్లోరైడుగల శిలీంధ్రనాశిని (బైటాక్స్) ఔషధం 3గ్రా. లీటరు నీటికి ఎకరాకు 600 గ్రాములు, 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కంతా బాగా తడిచేలా పిచికారి చేయాలి.
ఆకుమాడు తెగులు: ఈ తెగులు లక్షణాలు మొదట భూమికి దగ్గరగా వున్న ఆకుల తొడిమలపై పొడవాటి మచ్చల రూపంలో కనిపిస్తాయి. ఈ మచ్చలు మొదట పేలవమైన ఆకుపచ్చ రంగు నీటి మచ్చలుగా ఏర్పడి తర్వాత గోధుమ రంగుకు మారుతాయి. ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయి పై ఆకులకు, ఆకు తొడిమెలకు వ్యాప్తి చెంది తొడిమెలు మాడిపోతాయి. దీని నివారణకు శుభ్రమైన పంటసాగు, పంట అవశేషాలను నాశనం చేయడం మరియు 1 గ్రా. కార్బండజిమ్ లేదా 1 మి.లీ. ప్రొపికొనజోల్ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. ఎకరాకు 200 గ్రాముల కార్బండైజిమ్ లేదా 200 మి.లీ. ప్రొఫికొనజాల్ మందును పిచికారీ చేయాలి.
వేరుపురుగు: మురుగు నీటి వసతి లేని పొలాల్లో వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వేరుపురుగు మొదట అల్లం దుంపల మొదళ్ళలో వేర్లను కత్తిరించి పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరాకు 7 కిలోలు,లేదా ఫోరేట్ గుళికలు ఎకరాకు 5 కిలోలు వేసి వేరు పురుగు ను నిర్మూలించవచ్చు.
దుంపకుళ్ళు ఈగ: దుంప కుళ్ళును తట్టుకొనే పీచు తక్కువగా వుండే అల్లం రకాలను సాగుచేయాలి. వేసవిలో పొలాన్ని లోతుగా దున్ని బాగా ఆరనివ్వాలి. దాంతో భూమిలో ఉన్న లార్వాలు ఎండవేడికి నశిస్తాయి. మురుగునీటి కాలవలు ఏర్పాటు చేసి నీరు నిలవకుండా చేయాలి. ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను తోటంతా సమంగా వేసుకోవాలి.
ఆకుముడత పురుగు: ఈ పురుగు లార్వాలు ఆకులను చుట్టి తినేస్తుంది. నివారణకు 0.3 శాతం కార్బరిల్ (లీటరు నీటికి 3గ్రా. మందు చొప్పున ఎకరాకు 600గ్రాముల మందు + లీటరు నీటికి 1. మి.లీ. చొప్పున శాండోవిట్ 200 మిల్లీ లీటర్లు ఎకరానికి మందు ద్రావణం ఆకులపై పిచికారి చేయాలి.
మొవ్వు తొలుచు పురుగు: ఈ పురుగు మొవ్వును తొలచటం వలన మధ్య కొమ్ము చనిపోతుంది.దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2 మి.లీ. + సాండోవిట్ 1 మి.లీ. లేదా లీటరు నీటికి క్వినాల్ఫాస్ 2 మి.లీ. + సాండోవిట్ 1 మి.లీ. లేదా లీటరు నీటికి ఎండోసల్ఫాన్ 2 మి.లీ. + సాండోవిట్ 1 మి.లీ. కలిపిన ద్రావణాన్ని మొవ్వు ఆకులపై పిచికారి చేయాలి.
ఒక హెక్టారు(రెండున్నర ఎకరాలు) లో అల్లం సాగు చేస్తే దాదాపు 50 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
NOTE: అల్లం సాగు చేయాలనుకుని రైతులు ప్రభుత్వం ముద్ర పథకం లో రుణం తీసుకోవచ్చు.
No comments:
Post a Comment